సమాజహితం కోరేవాడు కొంచెం కఠినంగా మాట్లాడవచ్చు. అంతమాత్రాన పోయేదేం లేదు. కఠినంగా చెప్పినా అది మన మంచికోసమే అయినప్పుడు అందులో తప్పు ఎంచవలసిన పనిలేదు. ఈ విషయాన్ని ఒక చక్కని పోలికతో చెప్పాడు వేమన ఈ పద్యంలో.
వేమన తాను చెప్పదలచిన విషయాన్ని ముందు చెప్పి అతి చక్కని సాదృశ్యంతో దాన్ని సమర్థిస్తాడు. అది వేమన పద్యాలలో కనిపించే ప్రత్యేకత
ఈ పద్యంలో చూడండి.
చాకివాడు కోక చీకాకు పడజేసి
మైలబుచ్చి మంచి మడుపు జేయు
బుద్ధి చెప్పువాడు గుద్దితే నేమయా
విశ్వదాభిరామ వినురవేమ.
పూర్వకాలంలో మైల బట్టలు ఉతకాలంటే అది చాకలి వృత్తిలో ఉన్నవారి పని. గ్రామాలలో నదులు, చెరువులు ఉన్న చోటుకి ఊరివాళ్లు ఇచ్చిన మైలబట్టలు తీసుకుపోయి వాటిని పెద్ద బండలకు వేసి బాది మలినాన్ని(మైల) పోగొట్టి చక్కగా ఎండబెట్టి, చక్కని మడతతో తిరిగి ఏ ఇంటి బట్టలు ఆ ఇంటికి ఇచ్చేవారు చాకలివారు.
చాకివాడు = వస్త్రాన్ని
చీకాకు పడజేసి = బాగా బండకేసి బాది రక రకాలుగా మెలితిప్పి చికాకు
పెట్టి
మైలబుచ్చి = మాపు ను పోగొట్టి
మంచి మడుపు జేయు = చక్కగా మడత పెడతాడు.
బుద్ధి చెప్పువాడు = (ప్రజలకు) మంచి చేసేవాడు
గుద్దితే నేమయా = రెండు దెబ్బలు వేసి గుద్దితే మాత్రం ఏం పోయింది.
ఈ పద్యంలో కోక అనే పదానికి ఒకప్పుడు వస్త్రము అనే విస్తృతార్థం ఉండేది కానీ ఇప్పుడు కొన్ని మాండలికాలలో కోక అంటే స్త్రీలు ధరించే చీర అనే అర్థానికి పరిమితమై కనిపిస్తుంది. అలాగే నన్నయ కాలం నాటికి చీర అనే పదానికి స్త్రీ పురుషులు ఎవరు ధరించినదైనా వస్త్రం అనే విస్తృతార్థం ఉండేది. అది ఇప్పుడు చీర - స్త్రీలు ధరించే వస్త్రవిశేషం అనే అర్థానికి పరిమితమైంది.
చాకలివారు బాగా మాసిపోయిన వస్త్రాలను తీసుకుపోయి బాగా ఉతుకుతారు. ఆ వస్త్రం మలినం పోగొట్టడానికి వారు దాన్ని బండకేసి బాదుతారు. జాడిస్తారు. మెలికలు తిప్పుతారు. ఎండలో వేస్తారు. ఏదో విధంగా వస్త్రాన్ని రకరకాలుగా చికాకు పెట్టి చివరకు అతి చక్కని మడత పెట్టి శుభ్రంగా చేతికి ఇస్తారు.
ఆవిధంగానే సమాజానికి బుద్ధి చెప్పి మంచిదారిలో పెడదామని చూసేవాడు ఆ మంచి చెప్పే పద్ధతి కొంచెం కఠినంగా ఉండవచ్చు. అలాగే మరీ దారి మళ్లుతున్నారని పిస్తే దండించడం కూడా జరగవచ్చు. అయితేనేం అతను మంచి మార్పుకోసం ఇలా చేసినప్పుడు దాన్ని భరించి అతనినుంచి మేలు పొందాలన్నాడు వేమన.
👌
ReplyDelete