పిచ్చిపట్టినట్లు రెచ్చిపోయి ప్రభుత్వమే వేలాది అమాయక జనాన్ని పిట్టల్లా కాల్చి చంపిన కనీవినీ ఎరుగని కిరాతకం, కరకు ఆంక్షల ఇనుప తెరలు దాటి బయటి ప్రపంచానికి తెలియడానికి చాలా రోజులు పట్టింది. గజగజ వొణుకుతూ వెనక్కి వచ్చిన బండ్ల వారి ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు దారుణ దుర్వార్త ఆ రాత్రే తెలిసిపోయింది. ఘోరాతిఘోరాన్ని విన్న వారికి ఆ రాత్రి కునుకు లేదు. వారి గుండెలను పిండిన వేదనకు అంతులేదు.
అది......
13 ఏప్రిల్ 1919, వైశాఖి పర్వదినం. పంజాబీలకు అతి ముఖ్యమైన పంటల పండుగ. దీపావళి, హోళీల్లాగే వైశాఖినీ హిందు, సిక్కు తేడా లేకుండా, కులభేదం పాటించకుండా అందరూ కలిసి కోలాహలంగా జరుపుకుంటారు. ఎప్పటిలాగే ఆ ఏడూ ఎక్కడెక్కడి పల్లెల వారు బండ్లు కట్టుకుని అమృతసర్ చేరారు. కొత్త బట్టలు బొమ్మలు కొనిపెడుతూ, స్వర్ణ దేవాలయం దర్శించి, ఊరి బయట పెద్ద మేళాలో ఆటపాటల్లో పాల్గొంటూ జనం దిలాసాగా ఉన్నారు.
ఇది ప్రతి ఏడూ మామూలే. కానీ ఈసారి ఏదో చెప్పరాని వెలితి. ఊరివాళ్ల మొగాల్లో ఆందోళన. వాతావరణంలో ఉద్రిక్తత.
నాటికి నాలుగు రోజుల ముందు రౌలట్ చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళనను పురికొల్పిన సేఫుద్దీన్, సత్యపాల్ అనే పుర ప్రముఖులను అరెస్టు చేసి, ఎక్కడికో తీసుకుపోయారు. దానిపై అమృత్సర్ అంతటా హర్తాళ్ జరిపి మా నాయకులను ఏమి చేశారని అడగటానికి కలెక్టర్ బంగళాకు వెళ్లిన గుంపు మీద పోలీసులు పిచ్చెత్తినట్టు కాల్పులు జరిపారు. లెక్కలేనంత మందిని చంపేశారు. రెచ్చిపోయిన జనం యూరోపియన్ల బ్యాంకులను, పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేసి ఐదుగురు తెల్లవారిని చంపారు. దాంతో తెల్లదొరతనం తోకతొక్కిన తాచులా బుసలు కొడుతున్నది. ఎప్పుడు ఏమవుతుందోనని ప్రజల్లో భయం.. భయం.
మూడు రోజుల కిందట పంజాబ్ అంతటా మార్షల్ లా ప్రకటించారు. అమృత్సర్ కాపలా పని జనరల్ రెజినాల్డ్ ఎడ్వర్డ్ హెన్రీ డయ్యర్ కి అప్పగించారు. అతగాడు వచ్చిరాగానే నగరమంతటా సభలూ సమావేశాలను నిషేధించాడు. ఆ సంగతి సామాన్య జనానికి తెలియదు. కరకు ఆంక్షలు విధించినవాడు ఆ వైనం ప్రజలందరికీ తెలియపరచాలన్న బాధ్యత మరచాడు. జలియన్ వాలాబాగ్ లో ఆ సాయంత్రం నాలుగున్నరకు నాయకుల నిర్బంధానికి నిరసనగా బహిరంగసభ జరగనున్నదని వీధుల్లో చాటింపు అవుతున్నా వద్దు ఆ ప్రయత్నం మానుకోండని కనీసం నిర్వాహకులను పిలిచి హెచ్చరించాలని డయ్యర్ అనుకోలేదు.
నిషేధాజ్ఞలు ఎరుగని జనం బహిరంగ సభ జరగబోతోదంటే కుతూహలం కొద్దీ వేల సంఖ్యలో జలియన్ వాలాబాగ్ చేరారు. పిల్లలను భుజాల మీద ఎత్తుకుని, చెరుకుగడలు నములుతూ, తారసపడ్డ పారిచయస్థులతో కబుర్లాడుతూ, మైకులో ప్రసంగాలను చెవిన వేసుకుంటూ అందరూ ఆదమరిచి ఉన్నారు. వేటగాడిలా మాటు వేసి, జనరల్ డయ్యర్ 50 మంది రైఫిల్ మెన్ ను, నలభై మంది గుర్ఖా సిపాయిలను వెంట తీసుకుని సభా స్థలంలో ప్రవేశించాడు. అటు పాతిక మందినీ, ఇటు పాతిక మందినీ మెరక మీద బారుగా నిలబెట్టి, ఎలాంటి ముందస్తు హెచ్చరికా చేయకుండా డాయ్యాసురుడు అసుర సంధ్యవేళ "ఫైర్" అన్నాడు.
మొత్తం 50 మంది సైనికులు పది నిముషాల పాటు 1650 రౌండ్లు కాల్పులు జరిపారు. ప్రవేశ మార్గాలను మూసివేసి, గుమిగూడిన జనంపై గుళ్ల వర్షం కురిపించారు. నాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఆ సంఘటనలో 1000 కి పైగా మరణించగా, 2000 మందికి పైగా గాయపడ్డారు. ఈ హఠాత్పరిణామానికి నిశ్చేష్టులైన ప్రజలు బయటకు వెళ్ళడానికి వీల్లేని పరిస్థితుల్లో నెత్తురోడుతున్నా పార్కు గోడలపైకి ఎక్కేందుకు విఫలయత్నం చేశారు. కొందరు అక్కడే ఉన్న బావిలోకి దూకేశారు. అక్కడ స్మారక చిహ్నంపైన వ్రాసిన సమాచారం ప్రకారం అక్కడి బావిలోంచి 120 శవాలను బయటకు తీశారు.
జలియన్ వాలాబాగ్
పార్కులోని బావి
తన ఆఫీసులో బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అతనికి తిరుగుబాటు విప్లవకారుల సేన ఎదురైనందున కాల్పులు జరుపవలసి వచ్చింది. డయ్యర్ కు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ డ్వయర్ ఇచ్చిన టెలిగ్రాములో "నీ చర్య సరైనదే దానిని లెఫ్టినెంట్ గవర్నర్ సమర్ధిస్తున్నాడు" అని వ్రాసి ఉంది.
ఈ ఉదంతంపై విచారణ జరపడానికి 1919 లో "హంటర్ కమిషన్" ఏర్పరచారు. ఆ కమిషన్ సమక్షం లో డయ్యర్ తనకు ఆ మీటింగు గురించి 12:40 కి తెలిసిందని, దానిని నిలపడానికి తానేవిధమైన ప్రయత్నమూ చేయలేదనీ, అక్కడ సమావేశమైన గుంపు కనుక కనిపిస్తే కాల్పులు జరపాలనే ఉద్దెశంతోనే తాను అక్కడికి వెళ్లానని చెప్పాడు. "బహుశా కాల్పులు జరపకుండా గుంపును చెదరకొట్టడం సాధ్యం అయ్యుండవచ్చని నేను భావిస్తున్నాను. కానీ వాళ్లంతా మళ్ళీ తిరిగివచ్చి నన్ను అవహేళన చేసేవారు. నేను చేతగానివాడినయుండేవాడిని". (హంటర్ కమిషన్ సమక్షంలో డయ్యర్ స్పందన)
అంతే గాకుండా ఆ స్థలంలోనికి వాహనాలు వెళ్లగలిగితే తాను మెషిన్ గన్లతో కాల్పులు జరిపించి ఉండేవాడినని, ఇరుకైన సందులలోకి సాయుధ వాహనాలు వెళ్లడం కుదరలేదని చెప్పాడు. జనం చెల్లా చెదురైనా గాని కాల్పులు ఆపలేదని, కొద్దిపాటి కాల్పులవల్ల ప్రయోజనం లేదని, జనం అంతా వెళ్లిపోయేదాకా కాల్పులు జరపడం తన బాధ్యత అని చెప్పాడు. గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించడం తన బాధ్యత కాదు గనుక అలాంటి ప్రయత్నమేమీ చేయలేదనీ, ఆసుపత్రులు తెరచి ఉన్నందున వారే వెళ్లవచ్చునని కూడా అన్నాడు.
ఈ పవిత్రనేల అమాయక ప్రజల మరియు దేశభక్తుల రక్తంతో తడిచి, వాళ్ళ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి నేటికి 103 యేండ్లు పూర్తి అయినాయి. నేటి మన ఈ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు కారణం ఇటువంటి ఎందరో వీరుల త్యాగ ఫలితం.
సదా దేశం కోసం,ధర్మం కోసం జీవిద్దాం.
మన చరిత్రను మనం తెలుసుకుందాం.
భారత్ మాతాకీ జై.
Source: Wikipedia and Bhagat Singh by M.V.R. Shastri.
ఈ పవిత్రనేల అమాయక ప్రజల మరియు దేశభక్తుల రక్తంతో తడిచి, వాళ్ళ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి నేటికి 103 యేండ్లు పూర్తి అయినాయి. నేటి మన ఈ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు కారణం ఇటువంటి ఎందరో వీరుల త్యాగ ఫలితం.
సదా దేశం కోసం,ధర్మం కోసం జీవిద్దాం.
మన చరిత్రను మనం తెలుసుకుందాం.
భారత్ మాతాకీ జై.
Source: Wikipedia and Bhagat Singh by M.V.R. Shastri.
తలుచుకుంటే.. రక్తం మరుగుతోంది. స్వాతంత్ర్యం ఊరికే రాలేదన్న విషయం.. నేటి యువత తెలుసుకొనేదెన్నడో. వందేమాతరం.. జైహింద్
ReplyDeleteఆ జాతి అహంకార మృగాలకు పోయేకాలం వచ్చింది. ఆ దేశ ప్రధాని తో సహా అందరూ కరోనా రూపం లో అనుభవిస్తున్నారు. ఇంకా కర్మ ఫలం అనుభవించక తప్పదు. ఆ భగవంతుని గీత తెలిపినట్లు.
ReplyDeleteBharath matha ki JAI
ReplyDeleteJai Hind🙏🏻
Dear sir, it's very informative. ThankYou for sharing.
ReplyDelete